కోల్ కతా చేరుకున్న అమిత్ షా.. కాసేపట్లో కీలక సమావేశం.. సీఎం రేసులో ఎవరున్నారంటే..!
- అమిత్ షాకు ఘన స్వాగతం పలికిన సువేందు అధికారి
- కాసేపట్లో విశ్వ బంగ్లా కన్వెన్షన్ సెంటర్‌లో కీలక సమావేశం
- సీఎం రేసులో ఫ్రంట్ రన్నర్ సువేందు అధికారి
పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో ఈరోజు ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోనుంది. రాష్ట్రంలో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న తరుణంలో, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోల్‌కతా చేరుకున్నారు. బెంగాల్ అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకోవడంతో పాటు, కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.
కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న అమిత్ షాకు రాష్ట్ర బీజేపీ అగ్రనేత సువేందు అధికారితో పాటు ఇతర ముఖ్య నేతలు ఘనస్వాగతం పలికారు. ఈరోజు మధ్యాహ్నం విశ్వ బంగ్లా కన్వెన్షన్ సెంటర్‌లో జరగబోయే బీజేపీ శాసనసభాపక్ష సమావేశానికి అమిత్ షా హాజరవుతారు. ఈ సమావేశంలోనే రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది అధికారికంగా ఖరారు కానుంది. మమతా బెనర్జీని మట్టికరిపించిన సువేందు అధికారి సీఎం రేసులో ఫ్రంట్ రన్నర్ గా ఉన్నారు. ఆయననే శాసనసభాపక్ష నేతగా బీజేపీ అధిష్ఠానం ప్రకటించే అవకాశం ఉన్నట్టు సమాచారం. మరోవైపు, ఇద్దరు నేతలకు డిప్యూటీ సీఎంగా అవకాశం ఇవ్వొచ్చని తెలుస్తోంది.
బెంగాల్ పీఠంపై తొలిసారిగా కాషాయ జెండా ఎగురబోతున్న తరుణంలో, అమిత్ షా పర్యవేక్షణలో జరగబోయే ఈ పరిణామాలు జాతీయ రాజకీయాల్లో కూడా ఆసక్తిని రేపుతున్నాయి. మరోవైపు, బెంగాల్ రాజకీయాల్లో గత దశాబ్ద కాలంగా సాగిన పోరాటం తర్వాత, బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకోవడంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వెల్లువెత్తుతోంది.